KKR vs RR: సునీల్ నరైన్ వీరోచిత సెంచరీ.. రాజస్థాన్ ఎదుట భారీ టార్గెట్

KKR vs RR: సునీల్ నరైన్ వీరోచిత సెంచరీ.. రాజస్థాన్ ఎదుట భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్‌ గడ్డపై విండీస్ మాంత్రికుడు, ఆల్ రౌండర్ సునీల్ నరైన్ వీరవిరహం చేశాడు. 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు.  కోల్‌క‌తా త‌ర‌ఫున ఐపీఎల్‌లో శ‌త‌కం బాదిన మూడో ఆట‌గాడిగా రికార్డు నెల‌కొల్పాడు. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగుల వరద పారించాడు. అతన్ని ఔట్ చేయడానికి రాయల్స్ కెప్టెన్ శాంసన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒకానొక సందర్భంలో మ్యాచ్ నరైన్ vs రాజస్థాన్ బౌలర్లు అన్నట్లు సాగింది. అంతలా అతని విధ్వంసం సాగింది. అతని ధాటిగా కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.  

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 21 పరుగులకే వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ఫిలిప్ సాల్ట్(10) ను అవేశ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. అతని ఓవ‌ర్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సాల్ట్ ఔటైనా.. మరో ఎండ్ నుంచి నరైన్ మెరుపులు మాత్రం ఎక్కడా ఆగలేదు. తన బ్యాటింగ్ సత్తా ఏంటో.. తాను ఎక్కువ సేపు క్రీజులో నిల్చుంటే ఎలా ఉంటుందో రాయల్స్ బౌలర్లకు తెలిసొచ్చేలా చేశాడు. 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్న నరైన్.. మొత్తంగా 109 పరుగులు చేశాడు.

అతనికి యువ‌కెర‌టం అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(30 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు. ఒకానొక సమయంలో కోల్‌కతా 230పై చిలుకు స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, చివర నాలుగు ఓవర్లను రాజస్థాన్ బౌలర్లను కట్టడి చేయగలిగారు. శ్రేయాస్ అయ్యర్(11), రస్సెల్(13), రింకూ సింగ్(20 నాటౌట్; 9 బంతుల్లో) పరుగులు చేశారు.

రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. చాహల్ 4 ఓవర్లలో 54 పరుగులివ్వగా.. అశ్విన్ 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు.